కత్తిపీట - వేసవి ఊరగాయల ఊసులు
పూర్వం రోజుల్లో కత్తిపీట లేకపొతే నోట్లోకి ముద్ద వెళ్ళేదికాదు మరి,అలా అని వాళ్ళు కత్తిపీటలు తినేవాళ్లు అనుకోకండి (ఏదో అని చదువుతున్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు రాస్తున్నాడు అనుకోబోకండి) కత్తిపీట లేకుండా కూరగాయలు ఎలా తరుగుతారండీ, కూరలు లేకుండా అన్నం ఎలా తినేవారు- అదన్నమాట!
కత్తిపీట ఈ రోజుల్లో చాలా తక్కువమంది ఇంట్లో ఉంటోంది; ఒక వేళ ఉన్నా అందరూ-పెద్దవాళ్ళతో సహా “చాకే” వాడుతున్నారు కత్తిపీటకి ప్రత్యామ్నాయంగా- ఎవరో ఒకళ్ళో ఇద్దరో తప్ప,ఇదొక అలంకార ప్రాయపు వస్తువు అయిపొయింది చాలా మంది ఇళ్లల్లో. ఇక ఈతరం అమ్మాయిల సంగతి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంతమంచిది ఈ విషయంలో-కత్తిపీటని వాళ్ళ జీవితంలో ముట్టుకోలేదు అన్నా పెద్దగా ఆశ్చర్యపడక్కర్లా-ముట్టుకున్నారు అంటే ముక్కునా, బుగ్గనా వేలేసుకొని సంభ్రమాశ్చర్యాలకు గురి అవ్వాల్సింది మనం.
అసలు కత్తిపీటే లేని ఇళ్లే కోకొల్లలు,వేసవిలో ఊరగాయల సమయంలో మాత్రం ఆవకాయ ముక్కలకు మాత్రం కత్తిపీటే దిక్కు-ఆ కత్తిపీట వేరేది అనుకోండి, చాకుకు,మామూలు కత్తిపీటకు మామిడి టెంక స్వాధీనంకాదు కాబట్టి ఊరగాయ కత్తిపీటే దిక్కు(మామూలు కత్తిపీటతో కూడా ఆవకాయ ముక్కలు కొట్టే ఘనాపాఠీలు కొందరు ఉన్నారనుకోండి) కొంతమంది ఇళ్లల్లో ఏడాది ఏడాదీ ఊరగాయ పెట్టుకొనే ఇళ్లవాళ్ళు మాత్రం- మార్కెట్ లో మామిడికాయలు కొని ఆ అమ్మేవాడి దగ్గరే ఊరగాయముక్కలు కొట్టించుకుంటారు.బహు కొద్దిమంది మాత్రం పెద్ద కత్తిపీట ఇంట్లో ఉన్నవాళ్లు మాత్రం వాళ్ళ ఊరగాయ కాయలు వాళ్ళే కొట్టుకుంటారు- అందరూ కాదులెండి.
మేము ఉద్యోగరీత్యా 2002లో మద్రాస్ లో ఉన్నప్పడు “ప్యారిస్” (ప్యారీ కార్నర్ లో-మళ్ళీ మేం ఏదో ఆవకాయ కత్తిపీట కోసం “పారిస్” వెళ్ళొచ్చాం అనుకుంటారు-వెధవ బడాయిలు చెపుతున్నా అనుకుంటారు) దగ్గర మార్కెట్ లో ప్రత్యేకంగా కొనుక్కున్నాం-షాప్ వాడికి ముందుగా ఆర్డర్ ఇచ్చి మరీనూ.
మాకు మద్రాస్ కొత్తకదా -అలా అంటే మద్రాస్ మొహం మొదటిసారి చూస్తున్నాం అని కాదు,నేను లాగూలు వేసుకున్నప్పటినుంచి వెళ్తూనేవున్నా, లాగూలు వేసుకోనప్పుడు వెళ్లి ఉంటే నాకు గుర్తుండదుగా మరి-ఎవరైనా మా ఇంట్లోవాళ్లు చెపితే తప్ప, ఎవరూ చెప్పలేదు కాబట్టి నిక్కచ్చిగా చెప్పగలను, లాగూలు వేసుకున్నతర్వాతే మద్రాస్ చూడటం మొదలుపెట్టా-నేను చెప్పేది మొదటిసారి మేము మద్రాస్ లో నివసించడం గురించి- ఏవి ఎక్కడ ఉంటాయో ఆట్టే తెలియవు కదామరి!
అందుకని మా ఆవిడావాళ్ళ ఆఫీసులో ఓ కాంట్రాక్టర్ సహాయం తీసుకున్నాం - అతను ఆ కత్తిపీట చూసి బోలెడు “హాశ్చర్యపడటం” కూడా జరిగింది కూడా (మనం కూడా అప్పుడప్పుడు హాశ్చర్యపడుతుంటామే అలాగన్నమాట-తర్వాత మాఅవిడ అతనికి ఓ సీసాలో ఆవకాయ ఇచ్చినట్టు గుర్తు కూడా నాకు) అరవవాళ్ళు ఆవకాయ పెట్టుకోరు కదా-ఏదో ఓ పిల్ల మామిడి కాయలు(మనం చిన్నప్పుడు తింటామే అవి వగరుగా ఉంటాయి కదా) వాటితో “వాడ మాంగాయ” అంటారనుకుంటా అది పెట్టుకుంటారు.మరి వాళ్లకి ఆంధ్రావాళ్ళ ఊరగాయ కత్తిపీట, దాని వాడకం ఎలా తెలుస్తుంది-ఆంద్ర ఆవకాయ రుచి తెలుసుగాని!అదే ఆంధ్ర ప్రాంతంలో అయితే ఎవ్వరూ పట్టిచ్చుకోరు- మేం ఈ కత్తిపీట కొనుక్కోవడం గురించి!
ఆ తర్వాత ఒక్క ఏడాదో రెండు ఏళ్ళో మాత్రం ఇంట్లో ఊరగాయ ముక్కలు నేనే కొట్టాను.తర్వాతర్వాత మార్కెట్ లోనే కొట్టించడం, మేము పెట్టే పాతిక కాయల ఊరగాయలకి అటకమీంచి కత్తిపీట దింపటం,దాన్ని తుడవటం, సానపెట్టించడం- పదును పొతే-ఇంత తతంగం హడావుడీనూ.
అయినా కత్తిపీటని తప్పుపట్టి దానిమీద నిందవేయడం తప్పే-దాన్ని తరచుగా వాడకుండా ఏడాదికోసారి “సాలుసరి ఉత్సవాలకు” దేవుడి రధాన్ని బయటకు తీసినట్టు తీస్తే అదిమాత్రం ఏం చేస్తుంది తుప్పు పట్టక.మన మెదడైనా అంతేకదా మనం “రోజూవారి” వాడే జాబితాల్లో చేర్చకుండా ఉంటే తుప్పు పట్టదు మరి!
మద్రాస్ నుంచి మాతో పాటుగా చాలా జాగ్రత్తగా హైదరాబాద్ తీసుకొచ్చాం దాన్ని కూడా, “అగర్వాల్ పాకర్” కంటైనర్ లో- మేము హైద్రాబాదు కి బదిలీ అయినప్పుడు,అంత జాగ్రత్తగానూ అటకమీద చేర్చాం.
వేసవి రాగానే ఊరగాయలు సమయం కదా అని,అది కిందకి దింపుదాం అని మనసులో కోరిక ఉండేది.అదే మాట ఇంట్లో అంటే, మా అత్తగారూ,మా ఆవిడా "మనం పెట్టే పాతిక కాయల ఊరగాయకి అదేం కిందకి దింపక్కర్లా.మోండా మార్కెట్లో మామిడికాయల వాడి దగ్గరే డబ్బులు ఇచ్చి వాడి చేతే ముక్కలు కొట్టించొచ్చు” అనేవారు.
వాళ్లిద్దరూ ఆ మాట అనటంతో ధైర్యం చేయలేకపోయేవాడిని-మా అత్తగారు మాత్రం మా ఆవిడతో అనేవారు- నా సరదా, నా“చిన్నబోయిన” మొహం చూసి- పెద్దవాణ్ణయినా అప్పుడప్పుడు అలా “చిన్నబోతా” మరి అదేంటో- నాకు సిఫార్సు చేసే ఉద్దేశంతో "పోన్లేవే కత్తిపీట ఉంది, అతను సరదా పడుతున్నాడు" అని.
మా ఆవిడ మాత్రం ససేమిరా అనేది "ఆ కత్తిపీటతో ఏ వేలో కోసుకుంటే,అసలే హడావుడి మనిషి” అనేది- ఆ దెబ్బతో ఆవిడా మాట్లాడేవారుకాదు మళ్ళా.
ఏమాటకి ఆమాటే చెప్పుకోవాలి,మా అత్తగారికి ఓపికి ఉన్నంతవరకు ఆవిడా నేనూ మొండాకి పొద్దున్నే వెళ్లే వాళ్ళమ్.ఓ “నీళ్ల కాన్”, రెండు మెత్తటి గుడ్డలు, రెండు బకెట్లు, ఓ చిన్న చాకు, ఈ మొత్తం సరంజామాతో. మేము ఎప్పుడూ మామిడికాయలు కొనేవాడి దగ్గరకే వెళ్లేవాళ్ళం-వెళ్ళేది ఏడాదికి ఒకసారయినా మమ్మల్ని గుర్తుపట్టి పలకరించేవాడు!
మాగాయ్ కాయ, ఆవకాయ కాయ రుచులు చూడటం- చూసి చూసి, పళ్ళు ఎదో లాగా (జివ్వున) అయిపోయేవి-(ఓ రెండు రోజులు ఎక్కడ రేకుల చప్పుడు అయినా నా పళ్ళమీద ఎవడో గీస్తున్నటుగా ఉండేది కూడా) అన్ని కాయల రుచులతో-పులుపు ఉంటే పీచు ఉండేది కాదు, పులుపు, పీచు ఉంటే కాయలో రసం ఉండేది కాదు- ఎన్ని లెక్కలు, ఎంత విశ్లేషణ- ఆవకాయ పెట్టడం కాదు, దానికి తగ్గ కాయలు కొనటమే గొప్ప అనుభవంతో కూడుకున్న పని మరి. అందుకే మన “మహానటి డాక్టర్ పద్మశ్రీ భానుమతి రామకృష్ణ గారు” కూడా అత్తగారి పేరుతోనే ఓ కధల పుస్తకం రాశారు- నేను రాయబోవటం లేదు- మీరేం కంగారు పడబోకండి-ఇతగాడు రాసే అవన్నీ కూడా చదవాలా అని!
ఇక మేము ఎంచుకున్న కాయలు తీసుకోవడం అయిన తర్వాత, మేము తెచ్చిన నీళ్ల కాన్ నీళ్లు బకెట్లో పోసి వాటిల్ని సుబ్బరంగా కడిగి బట్టమీద ఆరేసి,తొడిమెలు తీసిపెట్టేవాళ్ళం- వాడు వాటిల్ని ముక్కలుగా కొట్టాలిగా మరి.
ముక్కలు కొట్టేటప్పుడు వాడి కత్తిపీట కింద మేము తీసికెళ్ళిన బట్ట పెట్టేవాళ్ళం- పద్ధతి పద్దతేగా మరి-వాడు ముక్కలుకొట్టిన తర్వాత జీడిముక్కలు, పల్చటి తెల్లటి పొర వస్తుందిగా టెంకని ఆనుకొని వాటిల్ని జాగ్రత్తగా చాకుతో తీసేవాళ్ళం- ఇంటికి ఒచ్చిన తర్వాత.
మా అత్తగారిని చూసి- పెద్దావిడ- ఆ తరం ఆవిడ కదా- చాలా మంది ఆడవాళ్లు వచ్చి అవిడ సలహాలు తీసుకునేవారు-ముక్కల విషయంలో,కారం, ఆవపిండి, వగైరా.కొంతమంది అయితే ఊరగాయ ఎలా పెట్టాలి మామ్మగారు అని కూడా అడిగేవారు.
వాడు మాకు కాస్త ధర తగ్గిచ్చి ఇచ్చేవాడు-“ఎవరైనా మిమ్మల్ని ఆడిగితే మీకిచ్చిన ధర చెప్పకండి” అనేవాడు.మాకు లోపల పీకుతుండేది-కానీ వాడి వ్యాపారం, కొనుక్కునే వాళ్ళ బేరం చేసే సామర్ధ్యం కదా మరి-మేము గమ్మున కూచ్చునే వాళ్ళం వాడు మమ్మల్ని చూడకపోతే ఒకళ్ళిద్దరికి మాత్రం ఒక ధర చెప్పి దీనికి బేరం ఆడండి,అటూ ఇటుగా- అని గుంభనంగా మా పని మేము చేసుకునేవాళ్ళం.
ముక్కలు కొట్టేటప్పుడు కూడా ఓ రూపాయి తగ్గిచ్చే వాడులెండి మాకు.ఏదైనా ఇంత సరంజామాతో కార్లో రావడం, ఇంటికి వెళ్లేముందు ఇంతా మళ్ళీ కార్లో పెట్టుకోవడం ఓ పెద్ద ప్రదర్శనలాగా ఉండేది, సరదాగా.చాలామంది చేతులూపుకుంటూ ఓ బాగ్ వేసుకుని వచ్చేవారు మరి-ఇంత ముందస్తు ఏర్పాట్లు అందరికి తట్టవుగా మరి.
మాకంటే మా అత్తగారు-నేనూ ఇంట్లోనే ముందు రోజే అన్నీ చూసుకునేవాళ్ళం మార్కెట్ కి తీసుకెళ్లాల్సినవన్నీ-ఏవైనా నేను మర్చిపోయినా ఆవిడ చెప్పేవారు - ఓవేళ మేమిద్దరం ఏదైనా మర్చిపోతే వెనకాల మా అవిడ ఉందిగా.కాన్ లో మిగిలిన నీళ్లు మాత్రం (మంచి నీళ్లు కదా) ఆ షాప్ వాడికి ఇచ్చి వచ్చేవాళ్ళం- వేసవి కాలం కదా అంచేత. మాగాయ కాయలు మాత్రం పీలర్ తో చెక్కుతీసి ఇచ్చేవాణ్ని-మా చిన్నతనంలో ఊరగాయల సమయంలో మునేరుకి వెళ్లి ఒడ్డున ఆల్చిప్పలు ఏరుకొచ్చేవాళ్ళం- “నందిగామ” మా ఊరు అని మునుపే చెప్పాను కదా-మీకు గుర్తుండే ఉంటుంది బహుశా; వాటిని కొద్దిగా అరగదీసి చిల్లు పడేంతవరకు సిద్ధం చేసుకుని ఇంట్లో ఉంచేవాళ్ళం. నలుగురు పిల్లలం కూచ్చోని వాటితో మాగాయ కాయ చెక్కులు తీసేవాళ్ళం!
అప్పట్లో ఊరగాయలు వందల్లో పెట్టేవాళ్ళు- పాతికా పరకా కాదు ఇప్పటిలాగా! మార్కెట్ నుండి వచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ మా అత్తగారే చూసుకునే వారు.మధ్యలో ఏదైనా సహాయం, గిన్నెల్లో సర్దటాలు, జాడీలలోకి పెట్టడాలు వగైరాల్లో మా ఆవిడ ఓ చేయివేసేది- ఇలా రకరకాల పాత్రల్లో పెట్టే దాంట్లో నా పాత్ర ఏమీ ఉండేదికాదు.
హైదరాబాద్ లో ఉన్నంత కాలం “అంబటి సుబ్బన్న-సామర్లకోట వాళ్ళ నూనే” వాడేవాళ్ళం-అతి శ్రేష్టమైనది,ప్రశస్తమైనది కూడా ఊరగాయలకి- బెంగళూరు వచ్చాక కూడా ఓ రెండేళ్లు ఇక్కడ కూడా అత్తయ్యగారు అదే నూనెతో ఊరగాయపెట్టారు కూడా! ఇప్పుడు ఎవరికీ పెట్టే ఓపికా లేదు,తినే తీరుబడీ లేదు, తింటే అరిగించుకునే శరీరాలు లేవు.చాలా మంది బజార్ లో కొనేసుకుంటున్నారు ఊరగాయలు ఇప్పుడు.
ఏదైనా వేసవికాలంలో ఊరగాయలు పెట్టడం అంటే ఆ రోజుల్లో ఒక పెళ్ళికి సిద్ధమయ్యే ఉత్సాహం ఉండేది-ముందస్తు ఏర్పాట్లతోనే ప్రతి ఇల్లు సందడి సందడిగా ఉండేవి-ఆ సందడి అంతా ఇప్పుడు కర్రీ పాయింట్లకి వెళ్ళిపోయింది.
ఏదైతేనేం కొన్నేళ్లు హాయిగా పెద్ద కత్తిపీటకి అటకమీదే విశ్రాంతి ఇచ్చాం వాడకుండా.కొన్నేళ్లక్రితం మా సోదరుడి కొడుక్కి ఇచ్చినట్టు గుర్తు,బహుశా వాళ్ళఇంట్లో కూడా అటకమీద ఎంచక్కా విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది పాపం నోరులేని పిచ్చిమొహం!
ఎందుకైనా మంచిది మీ ఇళ్లల్లో కత్తిపీట, ఊరగాయ కత్తిపీట ఉంటే- కాసిన్ని ఫోటోలు తీసి ఉంచుకోండి మీ ఫోటో ఆల్బంలో పెట్టుకోవచ్చు-కొన్నాళ్ళకి అవి కూడా కనపడవు కదా మరి.తర్వాత తరం వాళ్ళకి చూపించవచ్చు- మన మూతికి మాస్కులు పెట్టుకున్న ఫొటోలతో బాటు.